Wednesday, January 20, 2021

✍️...నేటి చిట్టికథఅనగనగా గోపయ్య అనే రైతు దగ్గర ఒక గొప్ప ఎద్దు ఉండేది... అది చాలా బలంగా ఉండేది. అయినా అది చాలా శాంతంగా ఉండేది. గోపయ్య ఏ పని చెబితే దాన్ని, చాలా ఇష్టంగా చేసి పెట్టేది.

✍️...నేటి చిట్టికథ


అనగనగా గోపయ్య అనే రైతు దగ్గర ఒక గొప్ప ఎద్దు ఉండేది... అది చాలా బలంగా ఉండేది. అయినా అది చాలా శాంతంగా ఉండేది. గోపయ్య ఏ పని చెబితే దాన్ని, చాలా ఇష్టంగా చేసి పెట్టేది.

గోపయ్య కూడా ఆ ఎద్దును చాలా ప్రేమగా, జాగ్రత్తగా చూసుకునేవాడు. దాన్ని అస్సలు కొట్టేవాడు కాదు. దాని మీద ఈగను కూడా వాలనిచ్చేవాడు కాదు. ఆ ఎద్దు గురించి అందరితోనూ గొప్పగా చెప్పేవాడు. 

ఒకసారి గోపయ్య ఊళ్ళో పెద్ద మనుషులతో మాట్లాడుతూ "నా ఎద్దు నూరు బండ్లను ఒకేసారి లాగేస్తుంది- కావాలంటే వెయ్యి నాణేలు పందెం" అనేశాడు. 

కొందరు ఆ మాటను వినీ విననట్టు ఊరుకున్నారు కానీ, గోపన్న అంటే సరిపోనివాళ్ళు కొందరు జట్టు కట్టి, "పందెం అంటే పందెం" అన్నారు. 

పందెం రోజు రానే వచ్చింది. ఊళ్ళో వాళ్ళు నూరు బండ్లనూ వరుసగా ఒకదాని వెనుక ఒకటి కట్టి ఉంచారు. గోపయ్య ఎద్దును తెచ్చి మొదటి బండికి కట్టాడు. ఎద్దుకు ఇదంతా కొత్తగా ఉంది. అయినా యజమాని తెచ్చి నిలబెట్టాడు గనక, అట్లా ఊరికే నిలబడిందది. 

అందరూ 'లాగు లాగు' అన్నారు. కానీ ఎద్దు మాత్రం కదల్లేదు. గోపయ్య ఏం చెబుతాడోనని ఎదురు చూస్తూ అది అట్లానే నిలబడి ఉన్నది. 

గోపయ్యకు తల తీసేసినట్లయింది. 'ఎద్దు బళ్ళను ఎందుకు లాగట్లేదు?' అని చికాకు మొదలైంది- ఆ చికాకులో 'తను దానికి లాగమని చెప్పనేలేదు' అని అతనికి గుర్తుకే రాలేదు. పైపెచ్చు, అది 'నా పరువు తీస్తోంది' అని చటుక్కున కోపం కూడా వచ్చేసింది: "వెయ్యి నాణేలు... పోగొట్టకు! వెయ్యి నాణేలు!! ఎప్పుడైనా చూశావా? అంత తిండి తినేది ఎందుకట, ఈ మాత్రం లాగలేవా?!" అని తిడుతూ, అందరు రైతుల లాగానే తనూ దాన్ని మొరటుగా చర్నాకోలతో కొట్టటం మొదలు పెట్టాడు అతను. 

గోపయ్య అంతకు ముందు ఎన్నడూ దానితో కోపంగా మాట్లాడలేదు. ఏనాడూ దాన్ని తిట్టలేదు; ఒక్క దెబ్బకూడా వెయ్యలేదు! మరి ఇప్పుడు అ పైన  అతను అంత కోపంగా అరవటం, పైపెచ్చు చర్నాకోలతో కొట్టటం ఎద్దుకు ఏమాత్రం నచ్చలేదు. దాంతో అది పూర్తిగా మొండికేసింది- ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దాన్ని కొట్టీ కొట్టీ అలసిపోయిన గోపయ్య పదిమందిలోనూ ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. డబ్బుతోబాటు పరువునూ పోగొట్టుకొని, తలవంచుకొని ఇల్లు చేరుకున్నాడతను. 

"గతంలో అవసరం ఉన్నప్పుడు చాలా సార్లు ఈ ఎద్దే వంద బండ్లను అలవోకగా లాగేసింది గదా, మరి ఇవాళ్ల ఎందుకు లాగలేదు?!" అన్న ఆలోచన రాలేదు, కోపంతో రగిలిపోతున్న గోపయ్యకు.

 అయితే ఆరోజు సాయంత్రం చూసేసరికి, ఎద్దు మేత మేయకుండా- స్తబ్దుగా నిలబడి ఉన్నది. దాని ఒంటినిండా చర్నాకోల వాతలు- ఆ గాయాల చుట్టూ ఈగలు ముసురుతుంటే అది విసురుకోవటం కూడా లేదు. గోపయ్య వంకే చూస్తూ కన్నీరు కారుస్తున్నది! 

దాన్ని చూసే సరికి గోపయ్య హృదయం ద్రవించింది. దాని గాయాలకు మలాం రాస్తూ అతను తన తప్పును గ్రహించాడు: 'ఈ మూగ జంతువుకూ హృదయం ఉంది. తన మాట నెగ్గాలన్న తొందరలో తను దాన్ని అనవసరంగా, కౄరంగా శిక్షించాడు. సున్నితమైన దాని మనసుకు గాయం కలిగించాడు!' 

గోపయ్య కళ్ల నీళ్ళతో దానికి క్షమాపణ చెప్పుకొని, నిమిరి, ముద్దుచేసి, దగ్గర చేసుకున్నాడు. అతని మనసును గ్రహించిన ఎద్దు కూడా కొంత కుదుటపడ్డది. 

తెలివి తెచ్చుకున్న గోపయ్య తర్వాతి రోజున మళ్ళీ గ్రామస్తులతో పందెం కాశాడు. 'ఈసారి పందెం రెండు వేల నాణేలు' అన్నారు గ్రామస్తులు. ఈసారి గోపయ్య ఎద్దుని కొట్టలేదు సరికదా, కనీసం అదిలించను కూడా లేదు. ప్రేమగా వీపు నిమిరి, 'లాగురా!' అనేసరికి, ఎద్దు వంద బండ్లనూ లాక్కొని ముందుకు ఉరికింది! 

గోపయ్య పందెం నెగ్గటమే కాదు; జీవితాంతం‌ ఉపకరించే పాఠం ఒకటి నేర్చుకున్నాడు- 'ఎంత తొందర, ఎంత చికాకు ఉన్నా సరే, మనసుల్ని మటుకు గాయపరచకూడదు' అని.

🍁🍁🍁🍁

అహింసాపరమో ధర్మ: 
తధాహింసా పరంతప:
అహింసాపరమం ఙ్ఞానం,
అహింసాపరమార్జవమ్

అహింసయే పరమధర్మము. అహింసయేగొప్పతపస్సు. అహింసయేఙ్ఞానము, ఋజుత్వము అవుతుంది.

🍁🍁🍁🍁🍁

No comments:

Post a Comment

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...