*ఆకలి విలువ.*.
హైదరాబాద్ , బంధువుల పెళ్లి కని బయల్దేరాము. బాగా ఆకలి వేస్తే ఒకచోట హోటల్ చూసి ఆగాము. తలా ఒక్కో ప్లేట్ ఆర్డర్ చేసి తిన్న తరువాత, బాగా ఆకలిగా ఉందని మరో ప్లేట్ ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు మా అమ్మాయిలిద్దరు..
టిఫిన్ సగం తిని, సగం వదిలేసి మధ్యలోనే లేచి వెళ్లి చేతులు కడిగేసారు. మిగిలి పోయిన టిఫిన్ చూసి నా మనసులో కళుక్కుమంది. ఆకలి వేసి తెప్పించుకున్నారు కదా మొత్తం తింటారనుకున్నగాని ఇలా వదిలేస్తారనుకోలేదు.
దారి మధ్యలో ఒకదగ్గర పుచ్చకాయముక్కలు కోసి ఐస్ పైనపెట్టి ఒకప్లాస్టిక్ ప్లేటులో ఆ ముక్కలు ఉంచి, వాటిమీద ఉప్పు చల్లి అమ్ముతున్నారు. అవి తిందామని బతిమాలి కారు ఆపించారు. ఇక్కడా అదే తంతు. అందరం తిన్నతరువాత మరో ప్లేటు ఆర్డర్ చేసి, సగం తిని సగం వదిలేసారు. ఈ సారి వారిలో నా శ్రీమతి కూడా చేరింది. మరోసారి బాధపడి, నోరుచేసుకోకుండా ఊరుకున్నాను. వద్దని వారిస్తే పిసినారి పైసా పోనియడు, తాను తినడు, తినేవారిని తిననియడు అని తిట్టుకుంటారని నోరు కట్టేసుకున్నాను. అంగరంగవైభవంగా అలంకరించిన వేదిక. వచ్చి పోయే అతిథులతో పెళ్లి మండపం కిటకిటలాడిపోతుంది. వేదికముందు కుర్చీలలో కూర్చున్నవారికి కూల్ డ్రింకులు అందిస్తున్నారు.
కూల్ డ్రింక్ తాగిన వారిలో చాలా మంది సగం వదిలేశారు. పెళ్ళి వారిని పలకరించి, భోజనాలవైపు బయలుదేరాము. ఎన్నిరకాల వంటకాలు పెట్టారో, లెక్కపెట్టడానికే పదినిమిషాలు పడుతుంది. నాకైతే చూసాకే సగం కడుపు నిండిపోయింది. భోజనాల దగ్గర జనాలను చూస్తుంటే కరువు ప్రాంతాలనుండి వచ్చిన వారిలాగా ఎగబడుతున్నారు. జీవితంలో ఏనాడు అలాంటి పదార్థాలు చూడలేదు ,తినలేదు ,ఇప్పుడు తినకపోతే జీవితం ఇంతటితో ముగిసిపోతుంది అన్నంతఇదిగా ఎగబడ్డారు.. ఎంత వడ్డించుకుంటున్నారో,ఎంతతింటున్నారో, ఎంతవదిలేస్తున్నారో వారికే తెలియడంలేదు. వడ్డించిన భోజనంలో సగం వృధాగా పోతుంది. అక్కడ జరుగుతున్న తతంగమంత గమనిస్తూ ఆలోచనలో పడిపోయిన నన్ను మా అమ్మాయి పిలిచింది భోజనానికి. చేతిలో పళ్లెంతో దానినిండా పదార్థాలు. కలుపుకోవడానికి కూడా చోటులేదు. అది చూసి అన్నం తినబుద్దికాలేదు. నాకు ఆకలిగాలేదు మీరు తినండి అని వారిని పురామయించి, ఓ పక్కన కూలబడిపోయాను.
అక్కడినుండి వస్తుంటే ఎవరో ఇద్దరు కూలీలు పల్లాలలలో వదిలేసిన భోజనాన్ని డేగిసలో నింపి గోడవతల విసిరేస్తున్న దృశ్యం కనిపించింది. వెంటనే మా అమ్మాయిలిద్దరిని పిలిచి చూపించాను. నోరెళ్ళబెట్టి చూసారు, కానీ వారి ముఖంలో ఏ రకమైన భావాలు కనిపించలేదు. నాకు మాత్రం గుండెల్లో దేవినట్లు,కాలికింద నేల కదిలిపోయినట్లు అనిపించింది. తిరుగుప్రయణంలో, నా మనసంతా వృధా అవుతున్న భోజనం చుట్టే తిరిగింది. ముభావంగా ఉండిపోయాను.
ఏమైంది నాన్నా?
పిల్లలిద్దరూ పిలిచేసరికి ఆలోచనల్లోంచి తేరుకుని, ఒక్కక్షణం ఆగి, జేబులోనుండి వందరూపాయల నోటు తీసి బయటపడేయమని నా శ్రీమతి చేతిలో పెట్టాను. అకస్మాత్తుగా నేనలా చెప్పేసరికి విస్తుపోయి చూసింది. నేను కల్పించుకుని, నువ్వు విన్నది నిజమే వందరూపాయల నోటు బయటపడేయమన్నాను. మరోసారి చెప్పాను. ఎమ్మాట్లాడుతున్నారండి మీరు. భోజనాల దగ్గరనుండి చూస్తున్నాను. ముభావంగా ఉంటున్నారు.
ఏమిమాట్లాడటంలేదు, ఏమైందని పలకరిస్తే, వందరూపాయలు బయటపాడేయమంటారా?
గాలిగాని సోకిందా, విసురుగా చూసింది.
ఒకవంద రూపాయల నోటు బయటపడేయమంటేనే నీకు అంతకోపం వచ్చింది కదా....? పొద్దున్నుండి మీరు హోటల్లో టిఫిన్, పుచ్చకాయముక్కలు, పెళ్లిభోజనాల దగ్గరకూరలు. దిలేసిన వచ్చిన వాటి విలువ ఎంతో తెలుసా? మీ ముగ్గురివి కలిపి దాదాపు వెయ్యి రూపాయలు అవుతుంది తెలుసా? అంటే మీరు వేయి రూపాయలు బయటపడేసారు.నేను వందరూపాయల నోటు విసిరేయడం పిచ్చయితే మీరు అవసరాన్ని మించి భోజనం వడ్డించుకుని, వదిలేయడం పిచ్చి కాదా? అన్నం పరబ్రహ్మ్ స్వరూపమన్నారు. అలాంటి అన్నాన్ని పడేసి మనం దైవాన్ని అవమానించినట్లు కాదా?వృధాగా పడేసే అన్నం ఒక పేదవాడి ఆకలి తీరుస్తుంది. మనం భోజనాన్ని వృధా చేయక పోతే ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయల దుర్వినియోగాన్ని ఆపినట్లే లెక్క. నేను ఆవేశంగా చెబుతున్నమాటల్ని అడ్డుకుంటు .... మీరొక్కరే అనుకుంటే సరిపోతుందా డాడీ, అడిగింది మా అమ్మాయి. అవునమ్మా చిన్నచిన్న నదులు కలిసి సాగితేనే మహానదులు ఏర్పడతాయి.
ఒక్కొక్కనీటిచుక్క కలిసి కుంభవృష్టి వర్షం అవుతుంది. వేల మైళ్ళ గమ్యమైన ఒక్కఅడుగుతోనే మొదలవుతుంది. చెప్పడం ఆపేసాను.
అందరూ ఆలోచనల్లో పడిపోయారు. "మార్పు కి బీజం పడినట్లే.......🌹🌹🌹
No comments:
Post a Comment