*శ్రీమద్ మహాభారతం-956- అనుశాసనిక పర్వము-83*
*మునులు-తపస్సు*
" పరమశివా ! చాలామంది మునులు ఋషులు తపస్సు చేస్తారు కదా ! దాని గురించి చెప్పండి " అని అడిగింది పార్వతి.
పరమశివుడు " పార్వతీ ! చాలామంది ఏవోవో కోరికలు తీరాలని తపస్సు చేస్తూ ఉంటారు. కాని తపస్సు అంటే వానప్రస్థాశ్రమంలో ఉన్నవారు చేసే ఒక ధర్మము. తపస్సు చేసే ముందు ఇంద్రియ నిగ్రహము పాటించాలి. ఉదయము సాయంత్రం యోగాభ్యాసం చెయ్యాలి. అలా కాకుండా ఏవేవో కోరికలతో తపస్సు చేస్తే కొంతకాలం స్వర్గసుఖములు అనుభవించి ఆ తపఃఫలం తరిగి పోగానే తిరిగి భూమిమీద జన్మిస్తారు. అంతే కాని తిరిగిరానిలోకాలకు వెళ్ళలేరు. ఇంకా కొంతమంది ఆ హారం తీసుకోకుండా కఠోరనియమాలతో పంచాగ్నుల మధ్య నిలబడి ఘోరంగా తపస్సుచేస్తారు. అలాంటి వారు కూడా కేవలం అప్సరకాంతలతో చేరి భోగములు అనుభవించి తృప్తిపడతారు. ఆ తపః ఫలం పూర్తికాగానే తిరిగి మానవులుగా జన్మిస్తారు.
అలా కాక ఎలాంటి కోరికలు లేకుండా తపస్సు చేసే వారు ముందుగా అహింసావ్రతము ఆచరిస్తారు. మనసా వాచా కర్మణా ఎవరికీ అపకారం హానిచెయ్యరు. సాటి ప్రాణుల ఎడల దయ, కరుణ కలిగి ఉంటారు. అందరి జీవులలో ఉండే ఆత్మ ఒక్కటే అని భావిస్తారు. అలాంటి వారు కూడా మరణానంతరం తమ భార్యాబిడ్డలతో స్వర్గ సుఖాలు అనుభవించి తిరిగి ఆ పుణ్యఫలం కరిగి పోగానే తిరిగి భూలోకంలో జన్మిస్తారు. ఈ రీతిగా తపస్సు చేసే వారందరూ స్వర్గసుఖాలతోనే తృప్తిపడుతుంటారు " అని పరమశివుడు పార్వతీ దేవికి వివరించాడు.
No comments:
Post a Comment