Tuesday, September 22, 2020

*ఊర్ధ్వలోకములు

*ఊర్ధ్వలోకములు*
ధర్మరాజు " పితామహా ! మేము చేసిన యుద్ధములో ఎంతోమంది మరణించారు కదా ! వారికి ఏ లోకములు ప్రాప్తిస్తాయి తెలపండి. ఎందుకంటే మానవులు అందరూ బ్రతకడం సుఖాలు అనుభవించడానికి అని, చావడం దుఃఖహేతువు అని భావిస్తారు కనుక ఎవరు తమతమ ప్రాణములను వదలుటకు సులభముగా అంగీకరించలేరు. అందుకని అడిగాను " అన్నాడు ధర్మరాజు. 

భీష్ముడు " ధర్మనందనా ! నీకు ఈ సందర్భంలో ఒక కీటకముకు వేదవ్యాసుడికి మధ్యజరిగిన సంభాషణ చెప్తాను విను. 

ఒకసారి వేదవ్యాసుడు బండ్లు పోయే దారిలో వేగంగా పరుగెడుతున్న ఒక పురుగును చూసి " ఓ పురుగా ! ఎందుకు అలా వేగంగా ఎందుకు అలా భయంతో వేగంగా పరుగెడు తున్నావు " అని అడిగాడు. ఆ పురుగు " ఓ మహాత్మా ! చూసారా ఈ దారిలో అతి వేగంగా బండ్లు వస్తున్నాయి. ఈ బండ్లశబ్ధము, ఎద్దుల రంకెలు మనుష్యుల అరుపులు నాకు బెదురు పుట్టిస్తున్నాయి. బ్రతకడం సుఖం, చావడం దుఃఖంకదా ! అందుకని ఆ బండ్ల కిందపడి చావకుండా ఇంకా కొంత కాలం బ్రతుకుదామని వేగంగా పరుగెడుతున్నాను. ఏమైనా ప్రాణులకు ప్రాణభీతి ఎక్కువ కదా ! " అన్నది. వ్యాసుడు " నీవా చిన్న పురుగువు. నీవు సుఖములు అనుభవించ లేవు. అటువంటి సమయంలో నీకు ప్రాణభయం ఎందుకు ? నీకు చావే సుఖముకదా ! అప్పుడు ఈ భయాలు ఉండవు " అన్నాడు. 

ఆ మాటలకు ఆ పురుగు నవ్వి " మహాత్మా ! పురుగులకు కీటకములకు ఇంద్రియ సుఖములు లేవని మీరు ఎలా చెప్పగలరు. మా పద్ధతిలో మేము కూడా మానవుల వలె మా దారిలో ఇంద్రియ సుఖములను అనుభవిస్తాము. అందుకే మాకు కూడా ప్రాణభయము, బ్రతుకు మీద ఆశ ఉన్నాయి. అయినా మునీంద్రా ! నా మనసు తెలుసుకోవాలని అడుగుతున్నావు కాని ఆ మాత్రము నీకు తెలియదా చెప్పు అని ఈవిధంగా చెప్పసాగింది.

*పురుగు - పూర్వజన్మ*

నేను పోయిన జన్మలో శూద్రుడను. చాలా ధనవంతుడను. ఆ జన్మలో నేను చాలా క్రూరుడను, అనాచారిని, అతిలోభిని. దయ, జాలి లేని వాడిని. దురుసుగా ఉండే వాడిని. అన్ని దుర్గుణములు కలిగినవాడిని. కాని నేను నా తల్లిని భక్తితో సేవించే వాడిని. ఒక నాడు మా ఇంటికి ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు. నేను అతడిని భక్తితో పూజించాను. అందువలన నాకు పునర్జన్మ స్మరణ కలిగింది. అప్పటి నుండి నాకు మంచిపనులు చేస్తే సుఖాన్ని ఇస్తాయి అనే స్మురణ కలిగింది. కనుక మునీంద్రా ! నాకు ఆ విషయముల గురించి సవిస్త్రరంగా వివరించండి " అని అడిగింది. 

వ్యాసుడు " ఓ కీటకమా ! నిన్ను చూడగానే నీ పూర్వజన్మ వృత్తాంతం నాకు తెలిసింది. నీవు గతజన్మలో పాపములు చేసినందువలన నీకు పురుగుజన్మ వచ్చిందని నాకు తెలుసు. అలాగే నీవు కొన్ని పుణ్య కార్యములు కూడా చేసావు. అందు వలననే నేను నీతో మాట్లాడుతున్నాను. నా తపోబలము చేత నేను నీకు ఈ పురుగుజన్మ నుండి విముక్తి కలిగిస్తాను. నీకు మనుష్యజన్మ ఎత్తి పుణ్యకార్యములు చేయవలెనన్న కోరిక కలగడం కూడా గతజన్మలో నీవు చేసిన పుణ్యకార్యముల ఫలమే ! మానవులు తాము చేసిన పుణ్యకార్యముల వలన దేవతలౌతారు. తాము చేసిన పాపకార్యముల వలన ఇలా కీటకముల జన్మ ఎత్తుతారు. నీవు గతజన్మలో చేసిన పుణ్య కార్యముల వలన నీకు గతజన్మస్మృతి కలగడమే కాక నా దర్శనభాగ్యము కూడా కలిగింది. నేను నీకు ఉత్తమగతులు ప్రసాదిస్తాను. ఇక నుండి నీవు జంతువుగాను, మానవులలో వరుసగా శూద్ర, వైశ్య, క్షత్రియ జన్మలెత్తి తుదకు బ్రాహ్మణజన్మ ఎత్తుతావు. నీకు అన్ని జన్మలలో పూర్వ జన్మస్మృతి ఉంటుంది " అని ఆ పురుగుకు వరం ఇచ్చాడు. ఆ పురుగు వ్యాసుడి పాదాలు తాకి ప్రాణాలు వదిలింది. ఆ తరువాత వ్యాసుడు వెళ్ళి పోయాడు.

No comments:

Post a Comment

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...