ధర్మాత్ములు ఎవరంటే..
ధర్మోరక్షతి రక్షితః ..ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. మనిషి ధర్మాన్ని ఆధారం చేసుకొని నడిచి తీరవల్సిందే! ధర్మాన్ని పాటించని వారు అష్టకష్టాలు పడవలసి వస్తుంది. ‘వ్యక్తి తన బాధ్యతగా నిర్వర్తించవలసిన కర్మలను పద్ధతిగా ఆచరించడమే ధర్మం’ అని శాస్త్ర వచనం. కన్న పిల్లల్ని పద్ధతిగా పెంచడం మాతృధర్మం అయితే, ఆ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి క్రమశిక్షణ పాటించేటట్టు చూడడం పితృధర్మంగా చెబుతారు. మైనపు ముద్దలైన బాలబాలికలను విద్యతో తీర్చిదిద్ది సమాజంలోకి పంపడం గురుధర్మం. ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ ధర్మాలను పాటించినప్పుడే సమాజమైనా, దేశమైనా పచ్చగా ఉండి నాలుగు కాలాల పాటు మనగలుగుతాయి.
జహాఁదయా తహాఁధర్మ్ హై, జహాఁలోభ్ వహాఁపాప్
జహాఁక్రోధ్ తహాఁకాల్ హై, జహాఁక్షమా వహాఁఆప్
..ధర్మం, దాని ముఖ్య లక్షణాలైన దయ, క్షమ వంటివాటిని ఆధారంగా చేసుకుని మహాత్మా కబీరు చెప్పిన పద్యమిది. ఎక్కడ దయకు స్థానం ఉంటుందో అక్కడ ధర్మం ఉంటుంది. ఎక్కడ క్షమ ఉంటుందో అక్కడ దైవం ఉంటుంది. లోభం ఎక్కడ ఉంటుందో అక్కడ పాపం ఉంటుంది. కోపం ఎక్కడ ఉంటుందో అక్కడికి మృత్యువు పిలువని పేరంటంగా వచ్చి సర్వనాశనం చేస్తుంది. మనిషి ధర్మాన్ని పాటించినప్పుడే సుఖసంతోషాలతో సంతృప్తిగా జీవించగలడని దీని అర్థం. అందుకే మన పురాణేతిహాసాలు ధర్మానికి పెద్దపీట వేశాయి. రామాయణంలో ధర్మానికి అద్దం పట్టే ఎన్నో ఘట్టాలున్నాయి. ఉదాహరణకు.. శ్రీరామచంద్రుడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు రుషులు, మునులు వచ్చి తాము రాక్షసుల వల్ల పడే బాధల గురించి చెప్పుకుంటే.. రాముడు వెళ్లి రాక్షసులతో యుద్ధం చేసి వారందరిని సంహరిస్తుంటాడు. దీన్ని గమనించిన సీతమ్మ తల్లి ఒకరోజు.. ‘మనం వచ్చింది మీ నాన్నగారి మాట పాటించడానికి అనేది మరిచి రాక్షసులను చంపుతున్నారు. ఇది ఎంతవరకు సరియైునదో నాకు అర్థం కావట్లేదు’ అంటుంది. ఆమె మాటలు విన్న రాముడు.. ‘నేను క్షత్రియుణ్ని. అయోధ్యయినా అరణ్యమైనా నాకు ఒక్కటే. కాబట్టి, నేను రాజధర్మాన్ని పాటిస్తూ చెడును సంహరించి మంచిని కాపాడుతున్నాను’ అని సమాధానమిచ్చాడు.
ధర్మానికి పది లక్షణాలున్నాయని ధర్మశాస్త్రాలు చెబుతాయి. అవేంటంటే.. ధృతి (ఆత్మవిశ్వాసంతో సంతోషంగా ఉండడం), దమం (మనసును అదుపులో పెట్టకోవడం), క్షమ (సహనం కలిగి ఉండడం), శౌచం (శారీరక, మానసిక శుభ్రత పాటించడం), అస్తేయం (మరొకరికి సొత్తుకు ఆశపడకుండడం.. దొంగతనాలు చేయకుండా ఉండడం), ధీ (బుద్ధి కలిగి ఉండడం), విద్య (మంచి చెడులు విశ్లేషించి ప్రవర్తించడం), సత్యం (నీతి నిజాయితీతో జీవించడం), అక్రోధం (భావోద్వేగాలను అదుపులో పెట్టుకొని వ్యవహరించడం) ఇంద్రియ నిగ్రహం (కోరికలకు కళ్లెం వేయడం). ఈ పది లక్షణాలనూ కలిగి ఉన్నవారు ధర్మాత్ములు.
No comments:
Post a Comment