Tuesday, April 16, 2019

భర్త అంటే ఆ ఫ్రిజ్ లాగా అన్నీ భరిస్తూ, అసలు కోపమే రాకుండా కూల్ కూల్ గా ఉండాలని... ఫ్రిజ్ దేవతా నమో నమ

నా శ్రీమతి దగ్గర నుండి ఫోన్...
"ఏవండీ.. వచేప్పుడు రెండు లీటర్ల పాలు తీసుకురారా"
"రెండా... ఎక్కువే నేమోనే..."
"ఏం కాదు... ఒకవేళ ఎక్కువైతే ఫ్రిడ్జ్ లో పెడదాంలే...",
ఫోన్ కట్ చేసింది...

ఫోన్ జేబులో పెడుతూ, "ఫ్రిడ్జ్ లో ఇంకా ప్లేసుందా..?", అని ఆశ్చర్యపోయా...

నా శ్రీమతి కి ఫ్రిడ్జ్ కీ
ఎన్నో ఏళ్ళ అనుబంధం ఐతే,
నాదీ ఫ్రిడ్జ్ దీ ఋణానుబంధం...

నేను ఫ్రిజ్ లో నుంచి ఏదైనా తీసుకోవాలంటే, డోర్ తెరిచి, వొంగి చూస్తా... కావాల్సింది ఉందో, లేదో తెలియాలంటే, కనీసం నాలుగు వారాల వారీగా పేర్చిన పెరుగు, పప్పు గిన్నెలూ, దోశ, ఇడ్లీ పిండి బాక్సులూ, ఇంకా ఏవిటో తెలీని గిన్నెలూ ఓ పది, పన్నెండు తియ్యాలి.

ఇప్పుడు...
అష్టావధానం మొదలు...
ఓ చోట చెయ్యి పెడితే, పక్కవి పడిపోకుండా కొన్నింటికి భుజం,
మరి కొన్నింటికి మోకాలు,
కొన్నిటినీ తలతో ఆపుతూ,
లోపల పెట్టిన చేత్తో అలా ఇలా కదిపితే... ఆ చిన్న కుదుపు ఓ చైన్ రియాక్షన్ లా మారి, తెరిచిన తలుపుకి ఓ వైబ్రేషన్ లా సోకి, ఆ బరువైన తలుపు ఆమాంతం మూసుకోవటానికొచ్చి,
నన్ను గుద్దుకుంటుంది చూడూ... ఆహా... అప్పుడు ఏం చెయ్యాలో మెదడుకి అందదు... కాళ్లూ, చేతులూ చాలా బిజీ... నడ్డి మీద డోరు... కోపమొస్తుంది... గట్టిగా అరవాలనిపిస్తుంది...
అరిస్తే,  భార్యామణి రావటం అటుంచి, ఏవైనా రెండో, మూడో కింద పడతాయేమోనని భయం... గోల గోల...రచ్చ రచ్చ

మొన్నామధ్య చంద్రముఖి సినిమా టీవీలో వస్తోంది. అదేదో గది తలుపు తెరవటానికి అందరూ భయపడుతున్నారు. కానీ, నాకేం భయం అనిపించలేదు. కానీ, మా ఫ్రిజ్జు డోరే... దీనికడుపుమాడ... దడ పుట్టిస్తుంది...

ఓరోజు నా శ్రీమతి,  "అన్నీ ఫ్రిజ్ లోనే ఉన్నాయి. కావాల్సినవి తీసుకుని, సమయానికి భోంచేయండీ అంది... మా అమ్మాయి  యింటికి వెళ్తూ..

ఆ "ఫ్రిజ్" అనే పదం వినగానే,
ఏదో అగ్నిపర్వతాలు పేలిన, భూన భోంతరాలు దద్దరిల్లిన అనుభూతి నాకు...

ఓసారి గోంగూర పచ్చడి ఫ్రిజ్ లో కష్ఠపడి వెతికి, అన్నంలో కలిపి, రెండు ముద్దలు తిన్నాక, తెలిసింది... అది గోంగూర కాదూ, గోరింటాకూ అని...

అసలూ.. అన్నుంటే గందరగోళం కాదూ ఎవరికైనా ... ఇంకా నయం ఏమేముంటాయో తెలుసా... నేను మా పాప పుట్టినరోజు కి అందరికీ పంచగా మిగిలిన చాక్లేట్లు, కాశీ నుంచి తెచ్చిన గంగాజలం, నెయ్యి తియ్యాలని కాలాల వారీగా జాగ్రత్త చేసిన వెన్న గిన్నలు, అప్పుడెప్పుడో త్వరగా చల్లగవ్వాలని డీఫ్రీజ్ లో పెట్టితే రాయిలా మారిన మంచినీళ్ళ సీసా... కనీసం రెండేళ్లనుంచి తెరవకుండా ఉండిపోయిన రకరకాల డబ్బాలూ,  మూడు రకాల పెరుగు గిన్నెలు, వివిధ  పేరు తెలియని పచ్చళ్ళు,  కాలక్రమేణా కూరగాయల బాక్స్ లో పాచిపోయిన కూరగాయలు,  దగ్గు సిరప్ బాటిళ్ళు,  చెప్పుకుంటూ పోతే, ఇలా చిత్ర విచిత్రమైనవన్నీ చేరాయి...

ఏదో ఓ రోజు పౌడరు డబ్బాలు, నైల్ పాలిష్ లు, సర్ఫ్, షాంపూలు, కూడా చేరవచ్చేమో...ఎందుకంటే అన్నింటి పైనా 'కీప్ ఇన్ ఎ కూల్ డ్రై ప్లేస్' అని వుంటుందికదా.

ఈ మధ్య ఓ పెద్దాయనతో మాట్లాడుతున్నా...
మాటల మధ్యలో, "నీకు మీ పాపకి మాటలు ఉగ్గు పాలతో పోసిందోయ్...", అన్నారు.
"జాగ్రత్తగా వెతికితే, ఆ ఉగ్గు పాలు కూడా మా ఫ్రిజ్ లో దొరుకుతాయి అండీ..." అన్నాను...
నాకు అంత విశ్వాసం మా ఫ్రిజ్ మీద...

ఐతే, మీకో విషయం చెప్పాలి... నాకెప్పుడైనా మనసు బాలేకపోతే, మా ఫ్రిజ్ తలుపు తెరిచి,
అలా కాసేపు చూస్తూ ఉండిపోతా...
"ఛి... ఛి... దీని ముందు నా సమస్యలెంత",
అనిపించగానే, హాయిగా వెళ్ళిపోతా...

పోయిన వారం  కొత్తగా ఉగాదికి కొన్న బట్టలు తీసుకొని మా యావిడ ఫ్రిజ్ వైపు వెళ్తోంటే, నాకెందుకో అది స్లో మోషన్ లో కనపడింది. వెంటనే, నేను తనకీ,  ఫ్రిజ్ కీ మధ్యలోకి వెళ్లి, ఆపి,
"అల్మారా అటూ", అని చూపించాను.
"ఓ... అవును కదా..!!", అని అటు వెళ్ళిపోయింది...

చెబితే ఆవిడ గొణుగుతుంది  గానీ, ఫ్రిజ్ తలుపు తెరిస్తే, వెన్నా, జున్నూ, పాలూ, పన్నీరూ, సగం కోసిన నిమ్మకాయా, కుళ్ళిన కొబ్బరికాయ ముక్కలు, ఎండిన కరివేపాకు, మళ్లీ వాడాల్సిన చింతపండు పులుసు, ఇంగువ ముద్దా -  ఇవన్నీ కలిపి ఇదీ అని చెప్పలేని వాసన వస్తుంది... అది దాదాపు నాప్తాలీన్ బిళ్ళల లాంటి వాసనకు దగ్గరగా ఉంటుంది... దాన్ని భరిస్తూనే వెతకాలి, ఏం వెతకాలన్నా...ఏమో బొద్దింకలు  చేరకూడదని అవి కూడా పెట్టిందేమో..

అన్నట్లు... మొన్నీమధ్యే తెలిసింది... ఏదో వెతుకుతూ, దాదాపు ఫ్రిజ్ లో సగం వస్తువులు బయటకు తీసా... అప్పుడు కనిపించింది ఫ్రిజ్ తలుపు తెరవగానే వెలిగే ఒక బల్బ్...

అప్పుడే ఓ పచ్చడి సీసా కూడా కనిపించింది... తర్వాత తెలిసింది, అది మా అత్తగారు బతికున్న రోజుల్లో తయారు చేసింది అని...ఆవిడ జ్ఞాపకార్థం పెట్టిందేమో...

చివరి మాట ఏమంటే...

ఇంతకీ అది ఫ్రిజ్జా లేక అన్నింటినీ ఘనీభవింపజేసే పుష్పకవిమానమా....

ఏమో నేను సరిగ్గా గమనించలేదేమో...మా కోడలి పిల్లతో అంటోంది, "అమ్మాయ్, ఎండాకాలం, ఆ మజ్జిగ గిన్నె, సాంబారు గిన్నె, పాలగిన్నె....ఇంకా ....

నాకు.. నా పైన.. ఆ ఫ్రిజ్ పై జాలి వేసింది.

భర్త అంటే ఆ ఫ్రిజ్ లాగా అన్నీ భరిస్తూ, అసలు కోపమే రాకుండా కూల్  కూల్ గా ఉండాలని...

ఫ్రిజ్ దేవతా నమో నమ:

No comments:

Post a Comment

Yes, she has gained weight? Defeated without losing a bout.

అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…. ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వ...