*🎶 “మా తెలుగుతల్లికి మల్లెపూదండ...”*
పిల్లలు ప్రతి రోజూ ప్రార్థన సమయంలో ఎంతో భక్తిశ్రద్ధలతో ఆలపించే గీతం *“మా తెలుగుతల్లికి మల్లెపూదండ”.* ఒకప్పుడు ఈ గీతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతంగా ఉండేది. తెలంగాణ విభజన తరువాత ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతంగా కొనసాగుతోంది.
రాను రాను రాష్ట్ర గీతంతో పాటు, ఆ *గీతాన్ని రచించిన మహాకవి సుందరాచారి* కూడా ఈ తరానికి గుర్తుండని పరిస్థితి ఏర్పడుతోంది. తెలుగు వారి వైభవాన్ని, సంస్కృతిని, గొప్పతనాన్ని చాటిచెప్పిన ఈ గీత రచయితను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది.
*✍️ సుందరాచారి – గొప్ప కవి*
సుందరాచారి గొప్ప కవి. తనకోసం ఏమీ దాచుకోకుండా సాహిత్యానికే తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన కవిత్వాన్ని పోషించి, ప్రచారం చేసిన వారిలో *వై.కె.వి.ఎన్. ఆచార్య ముఖ్యులు.* ఆచార్య సుందరాచారికి మంచి మిత్రుడు. ఆయన కృషి వల్లే సుందరాచారి జీవితంలోని అనేక ఘట్టాలు వెలుగులోకి వచ్చాయి.
*“ప్రసన్నకవి సుందరాచారి – నేను”* అనే శీర్షికతో వై.కె.వి.ఎన్. ఆచార్య సుందరాచారి జీవిత చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చారు. *2020లో వి.జి.ఎస్. ప్రచురణ సంస్థ “ప్రసన్నకవి”* పేరుతో పిల్లల కోసం సుందరాచారిపై మరో పుస్తకాన్ని ప్రచురించింది.
సుందరాచారి ‘తేటగీతి’ పద్యానికి ప్రసిద్ధుడు. మహాత్మా గాంధీజీ మరణాన్ని *“బలిదానం”* పేరుతో గేయంగా రచించారు. కూరాకు మోపును మోసుకుని అమ్మడానికి నడిచివస్తున్న ఒక పల్లెటూరి శ్రామిక మహిళను చూసిన దృశ్యం ఆయనను ఎంతగానో కదిలించింది. ఆ అనుభూతితో *“కూరాకు పడుచు”* అనే శీర్షికతో పద్యాలు రచించారు. అవి ఆనాటి మాసపత్రిక *“భారతి”* లో ప్రచురితమయ్యాయి.
*“మా దేశం మా దేశం మహ మంచిదిరా మా దేశం”* అనే గేయంలో భారతదేశంలో జన్మించిన అనేకమంది కవుల గురించి ఆయన ప్రస్తావించారు.
*📚 సాహిత్య సేవ*
సుందరాచారి 1914 ఆగస్టు 10న జన్మించారు. కొంతకాలం *ఉపాధ్యాయునిగా పనిచేశారు.* అనంతరం సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేశారు.
ఆయన *“సుందర రామాయణం”* పేరుతో రామాయణాన్ని రచించారు. అలాగే *“సుందర భారతం”* కూడా వ్రాశారు. తిరుపతి వేంకటేశ్వర స్వామి పేరు మకుటంగా *“శ్రీనివాస శతకం”* రచించారు.
*“జపమాల”, “బుద్ధగీతి”* పేర్లతో బుద్ధుని చరిత్రను కూడా రచించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ *“గీతాంజలి”* ని తెలుగులోకి అనువదించారు. మూలంలోని భావాన్ని మాత్రమే తీసుకుని, భావం చెడకుండా, తెలుగు నుడికారం దెబ్బతినకుండా చేసిన ఈ స్వతంత్ర అనువాదం ఎంతో ప్రశంసలు పొందింది.
*“ఏకలవ్యుడు”* అనే ఖండకావ్యం, *“కెరటాలు”* అనే గ్రంథం కూడా రచించారు. *“సుందర సుధాబిందువులు”* పేరుతో భావగీతాలు రాశారు. జానపద గీతాలు రచించారు. స్థలపురాణాలను కూడా రాశారు.
*“అపవాదు”, “పేదకవి”, “నా స్వామి”, “నేటి కవిత్వము”, “బలిదానము”, “కార్వేటి నగరరాజ నీరాజనము”* మొదలైనవి ఆయన ఇతర రచనలు.
*🎶 “మా తెలుగుతల్లికి మల్లెపూదండ”*
1942లో *“దీనబంధు”* అనే సినిమా కోసం సుందరాచారి *“మా తెలుగుతల్లి”* గీతాన్ని రచించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ చిత్ర నిర్మాత ఈ గీతాన్ని సినిమాలో ఉపయోగించలేదు.
తర్వాత ప్రముఖ గాయని *టంగుటూరి సూర్యకుమారి* ఈ గీతాన్ని గానం చేశారు. *1975లో “మా తెలుగుతల్లి”* గీతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతంగా ప్రకటించారు.
సుందరాచారికి *“సుందరకవి”, “ప్రసన్నకవి”* అనే బిరుదులు కూడా ఉన్నాయి.
తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు వారి వైభవాన్ని తన రచనల ద్వారా చాటిచెప్పిన ఈ మహాకవి 1977 ఏప్రిల్ 8న తుదిశ్వాస విడిచారు.
🌺 మన రాష్ట్ర గీతాన్ని అందించిన మహాకవికి తగిన గుర్తింపు ఇవ్వడం మన బాధ్యత.
ఆగస్టు 10 — మహాకవి సుందరాచారి జయంతి.
*🙏 ఆ మహాకవిని స్మరించుకుందాం...*
*తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుందాం... 🙏*
💐💐💐💐💐💐💐