Sunday, March 8, 2020

శ్రీమద్భగవద్గీతపదునేడవ అధ్యాయముశ్రద్ధాత్రయ విభాగయోగముఅర్జున ఉవాచయే శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః |తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్త్వమాహో రజస్తమః ||

శ్రీమద్భగవద్గీత

పదునేడవ అధ్యాయము

శ్రద్ధాత్రయ విభాగయోగము

అర్జున ఉవాచ

యే శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః |
తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్త్వమాహో రజస్తమః ||        1

అర్జునుడు: కృష్ణా! శాస్త్రవిధులను విడిచిపెట్టినప్పటికీ శ్రద్ధతో పూజాదులు చేసేవాళ్ళ ప్రవృత్తి ఎలాంటిది?సాత్వికమా? రాజసమా? తామసమా?

శ్రీ భగవానువాచ

త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా |
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు ||            2

శ్రీ భగవానుడు: ప్రాణుల సహజసిద్ధమైనశ్రద్ధ సాత్వికమనీ, రాజసమనీ, తామసమనీ మూడువిధాలు. దానిని వివరిస్తాను విను.

సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత |
శ్రద్ధామయో௨యం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఏవ   సః ||        3

అర్జునా! మానవులందరికీ వారివారి స్వభావాన్నిబట్టి శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధలేనివాడంటూ లేడు. ఎవడికి ఎలాంటి శ్రద్ధ వుంటుందో వాడు అలాంటివాడే అవుతాడు.

యజంతే సాత్త్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః |
ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజన్తే తామసా జనాః ||        4

సాత్వికులు దేవతలనూ, రాజసులు యక్షరాక్షసులనూ, తామసులు భూతప్రేతాలనూ పూజిస్తారు.

అశాస్త్రవిహితం ఘోరం తప్యన్తే యే తపో జనాః |
దంభాహంకారసంయుక్తాః కామరాగబలాన్వితాః ||        5

కర్శయన్తః శరీరస్థం భూతగ్రామమచేతసః |
మాం చైవాన్తఃశరీరస్థం తాన్ విద్ధ్యాసురనిశ్చయాన్ ||    6

శాస్త్రవిరుద్ధంగా ఘోరతపస్సులు చేస్తూ అవివేకంతో తమ శరీరంలోని పంచభూతాలనే కాకుండా, అంతరాత్మగా వున్న నన్ను కూడా పీడించే ఆడంబరులూ, అహంకారులూ, కామబలగర్వితులూ, అసురస్వభావం కలిగినవాళ్ళని తెలుసుకో.

ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః |
యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు ||            7

అందరికీ ఇష్టమైన ఆహారం మూడు విధాలు. అలాగే యజ్ఞం, తపస్సు, దానం కూడా. వాటి తేడాలను తెలియజేస్తాను విను.

ఆయుఃసత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాః |
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యాః ఆహారాః సాత్త్వికప్రియాః ||8

సాత్వికులకు ప్రీతికలిగించే ఆహారపదార్థాలు ఇవి: ఆయుర్దాయం, బుద్ధిబలం, శరీరబలం, ఆరోగ్యం, సుఖం, సంతోషం—వీటిని వృద్ధిచేస్తూ రసమూ, చమురూ కలిగి, చాలాకాలం ఆకలిని అణచిపెట్టి, మనసుకు ఆహ్లాదం కలగజేసేవి.

కట్వమ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః |
ఆహారా రాజసస్యేష్టాః దుఃఖశోకామయప్రదాః ||        9

బాగా చేదు, పులుపు, ఉప్పు, వేడి, కారంకలిగి, చమురులేకుండా వెర్రిదాహం పుట్టించే ఆహారపదార్థాలంటే రాజసులకు ఇష్టం. ఇవి శరీరానికి బాధ, మనసుకు వ్యాకులత, వ్యాధులు కలగజేస్తాయి.

యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ |
ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ ||        10

తామసులకు చల్లబడిపోయింది, సారంలేనిది, వాసనకొడుతున్నది, చలిది, ఎంగిలిది, అపవిత్రమైనది అయిన ఆహారమంటే ఇష్టం.

అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే |
యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్త్వికః ||            11

తమ కర్తవ్యంగా విశ్వసించి, ఫలాపేక్ష లేకుండా శాస్త్రసమ్మతంగా చేసే యజ్ఞాన్ని సాత్వికయజ్ఞమంటారు.

అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్ |
ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసమ్ ||            12

అర్జునా! ఫలాన్ని ఆశించికాని, ఆడంబరంకోసంకాని చేసే యజ్ఞం రాజసయజ్ఞమని గ్రహించు.

విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణమ్ |
శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే ||            13

అశాస్త్రీయంగా అన్నదానం, మంత్రాలు, దక్షిణ లేకుండా అశ్రద్ధతో ఆచరించే యజ్ఞాన్ని తామసయజ్ఞమని చెబుతారు.

దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్ |
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే ||                14

దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించడం, పవిత్రంగా వుండడం. కల్లాకపటం లేకుండా ప్రవర్తించడం, బ్రహ్మచర్యదీక్షనూ, అహింసావ్రతాన్నీ అవలంబించడం –వీటిని శరీరంతో చేసే తపస్సని చెబుతారు.

అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ |
స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే ||            15

ఇతరులకు బాధ కలిగించకుండా సత్యం, ప్రియం, హితమూ అయిన సంభాషణ సాగించడం, వేదాధ్యయనం చేయడం వాక్కుకు సంబంధించిన తపస్సు అంటారు.

మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః |
భావసంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే ||                16

మనసును నిర్మలంగా వుంచుకోవడం, మౌనం వహించడం, శాంతస్వభావమూ, ఆత్మనిగ్రహమూ, అంతఃకరణశుద్ధీ కలిగివుండడం మనస్సుతో చేసే తపస్సు అవుతుంది.

శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః |
అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్త్వికం పరిచక్షతే ||            17

నిర్మలమైన మనసు కలిగినవాళ్ళు పరమశ్రద్ధతో ఫలాపేక్ష లేకుండా మూడు విధాలైన ఈ తపస్సు చేస్తే అది సాత్వికమని చెబుతారు.

సత్కారమానపూజార్థం తపో దంభేన చైవ యత్ |
క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువమ్ ||            18

సత్కారం, సన్మానం, పూజలు పొందడంకోసం ఆడంబరంగా ఆచరించే తపస్సు అస్థిరం, అనిశ్చితం. అలాంటిది రాజసమంటారు.

మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః |
పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతమ్ ||            19

మొండిపట్టుదలతో తన శరీరానికి బాధ కలిగేటట్లుకాని, ఇతరులకు హాని తలపెట్టికాని చేసే తపస్సు తామసమవుతుంది.

దాతవ్యమితి యద్దానం దీయతే௨నుపకారిణే |
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్ ||        20

దానం చేయడం కర్తవ్యంగా భావించి, పుణ్యక్షేత్రాలలో పర్వదినాలలో యోగ్యతను గమనించి, ప్రత్యుపకారం చేయలేనివాళ్ళకు చేసేదానం సాత్వికం.

యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః |
దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్ ||        21

ప్రత్యుపకారం పొందాలనే వుద్దేశంతోకాని, ప్రతిఫలాన్ని ఆశించికాని, మనసులో బాధపడుతూకాని చేసేదానం రాజసం.

అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే |
అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్ ||            22

అనువుకానిచోట అకాలంలో అపాత్రుడికి అగౌరవంగా, అవమానకరంగా యిచ్చేదానం తామసం.

ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః |
బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా ||            23

పరబ్రహ్మకు ఓమ్ తత్ సత్ అనే మూడు పేర్లు చెప్పారు. పూర్వం దానివల్లనే బ్రాహ్మణులు, వేదాలు, యజ్ఞాలు సృష్టించబడ్డాయి.

తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః |
ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినామ్ ||        24

అందువల్లనే వేదవేత్తలు శాస్త్రోక్తంగాచేసే యజ్ఞాలు, దానాలు, తపస్సులను ఎప్పుడూ “ ఓమ్ ” అని చెప్పిన తరువాతే ఆరంభిస్తారు.

తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపఃక్రియాః |
దానక్రియాశ్చ వివిధాః క్రియన్తే మోక్షకాంక్షిభిః ||        25

మోక్షాన్ని కోరేవాళ్ళు ఫలాపేక్ష లేకుండా పలువిధాలైన యజ్ఞాలు, దానాలు, తపస్సులవంటి పుణ్యకార్యాలు తత్ అనే శబ్దాన్ని ఉచ్చరించిన అనంతరమే ఆచరిస్తారు.

సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ప్రయుజ్యతే |
ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే ||            26

పార్థా! ఉనికి, ఉత్తమం—ఈ రెండు అర్థాలలో సత్ అనే పదాన్ని వాడతారు. అలాగే శుభకార్యాలలో కూడా సత్ శబ్దాన్ని ఉపయోగిస్తారు.

యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే |
కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే ||                27

యజ్ఞం, తపస్సు, దానాలలోని నిష్ఠకు కూడా సత్ శబ్దం సంకేతం. ఈశ్వరుడి ప్రీతికిచేసే కర్మలన్నిటినీ సత్ అనే చెబుతారు.

అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ |
అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ ||                28

పార్థా! హోమం, దానం, తపస్సు, ఇతర కర్మలు—వీటిని అశ్రద్ధగా ఆచరిస్తే అసత్ అంటారు. వాటివల్ల ఇహలోకంలోకాని, పరలోకంలోకాని ఫలితమేమీ వుండదు.

ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని " శ్రద్ధాత్రయ విభాగయోగము" అనే పదునేడవ అధ్యాయం సమాప్తం.

No comments:

Post a Comment

Jamalapuram Sri Venkateswara Swamy Temple జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయం Telangana Tirupati, Khammam District

The road access to the temple is very good, and you can easily reach it in your own vehicle. Parking is not a concern as you can park comfor...