Tuesday, July 23, 2024

Vaakaya , cranberries

పెట్టుబడి లేని పంట!

సాగు నీటి తడులు అక్కర్లేదు. అంతా వర్షాధారమే. చీడపీడల బెడద బొత్తిగా లేదు. పంటను గొడ్లు తింటాయన్న భయం లేదు. దీని కొమ్మలకే ముళ్లుంటాయి కాబట్టి వేరే కంచె వేసే ఖర్చూ లేదు. మొక్కలు నాటిన మూడో ఏడాది నుంచి కాయలు కోసి అమ్ముకోవడమే! కోత కూలి తప్ప మరే ఖర్చూ లేదు. అలా సుదీర్థకాలం ఎంచక్కా పంట తీసుకుంటూనే ఉండొచ్చు. భలే బాగుంది కదండీ.. ఖర్చులేని తోట సాగు కథ! ఇంతకీ ఈ పంట పేరు #క్యాండేట్_చెర్రీ.. అదేనండీ..#వాక్కాయ! Carissa Carandas దీని శాస్త్రీయ నామం. కడివేటి విశ్వనాథ రెడ్డి, జగన్నాథ రెడ్డి ప్రకాశం జిల్లాలో ఈ పంట సాగుకు శ్రీకారం చుట్టారు. ఇతర రైతులకు మార్గదర్శకులుగా నిలిచారు.
 
అందరూ సాగు చేసే పంటలను ఆరుగాలం కాయకష్టం చేసి, అయినకాడికి అప్పులు చేసి పంటలు పండించినా.. దిగుబడి లేకనో, మార్కెట్‌లో ధర దక్కకనో రైతులు ఆర్థికంగా నష్టాల పాలవుతున్న రోజులివి. అయితే, కొండంత ధైర్యంతో కొత్త పంటలపై దృష్టి సారిస్తూ.. చక్కటి ఆదాయం పొందే రైతులు కొందరే! వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న అటువంటి ధీశాలురు కడివేటి విశ్వనాథ రెడ్డి, జగన్నాథ రెడ్డి రైతు సోదరులు. తమ ప్రాంతానికి కొండ రేగు, సుబాబుల్ సాగును పరిచయం చేసిన ఈ రైతు సోదరులు.. ఇప్పుడు మరో చక్కని ఆహార పంటను సాగు చేస్తూ కొత్తదారి చూపుతున్నారు. అడవి జాతికి చెందిన ఈ పంట పేరు క్యాండేట్ చెర్రీ లేదా వాక్కాయ. వాక్కాయలు తెలిసినవే అయినా దీర్ఘకాలిక పంటగా దీన్ని సాగు చేయడం కొత్త విషయం.
 
ఎకరానికి 200 మొక్కలు
విశ్వనాథరెడ్డి చెప్పిన వాక్కాయ సాగు విశేషాలు ఇవీ..
ఒంగోలులో 1984లో మధుసూదన్‌రెడ్డి అని ఉద్యాన శాఖ అధికారి ఉండేవారు. ఆయన సలహాతో కొండరేగు పంటను జిల్లాలో తొలిసారిగా సాగు చేశాం. ఆ తర్వాత మూడేళ్లకు వారణాసి నుంచి వాక్కాయ మొక్క తెచ్చి నాటాం. దిగుబడి బాగుండటంతో నారు పెంచి ఇతర రైతులకు కూడా విక్రయిస్తున్నాం. ఈ పంట సాగుకు నల్లరేగడి నేలలు అనువుగా ఉంటాయి. మొదట సాళ్ల మధ్య 9 అడుగులు, మొక్కల మధ్య 12 అడుగులు ఖాళీ ఉంచి నాటాం. రెండేళ్లకే దట్టంగా పెరిగి మధ్యలో నుంచి మనిషి వెళ్లే సందు కూడా లేకపోవడంతో.. మధ్య సాళ్లలో చెట్లను తొలగించాం. ఎకరాకు 200 మొక్కలు మిగిలాయి.
 
కలుపు బెడద వల్ల అంతర పంటల సాగు ప్రయత్నం మానుకున్నాం. ఈ మొక్క ఖరీదు రూ.15- రూ. 20 వరకు ఉంది. మొక్కలు నాటేందుకు మరీ లోతు గుంటలు తీయాల్సిన అవసరం లేదు. కేవలం జానెడు గుంటలోనే నాటేయొచ్చు. మూడో ఏట నుంచి పంట చేతికొస్తుంది. మొక్కలు నాటేటప్పుడే ఎకరానికి 4 ట్రాక్టర్ల చివికిన పశువుల ఎరువు తోలాం. ఇది ఎడారి మొక్క కాబట్టి నీరు లేకపోయినా బతుకుతుంది. ఎక్కువ నీరు పెడితే దిగుబడి తగ్గుతుంది! ఫిబ్రవరి- ఏప్రిల్ మధ్యలో చెట్లు పూతకు వస్తాయి. జూలై, ఆగస్టు నెలల్లో వర్షం పడిన వెంటనే పూత కాస్తా పిందెలవుతాయి. ఆ తర్వాత కొద్ది రోజులకు పంట కోతకొస్తుంది. ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. కిలో ధర రూ.30 పలుకుతుంది. ఏడాదికి ఎకరాకు రూ.90 వేల ఆదాయం వస్తుంది. ఎరువులు, కోత కూలీ ఖర్చు రూ.15 నుంచి 20 వేలకు మించదు. వాక్కాయ చెట్ల ఆకుల నుంచి పాలు వస్తుంటాయి. అందువల్ల గొర్రెలు, గేదెలు వీటి జోలికి రావు.
 
ఈ పంటకు పెట్టుబడి తక్కువ. ఆదాయం ఎక్కువ. మార్కెటింగ్ మొదట్లో ఇబ్బందిగా ఉండేది. ఇటీవల విజయవాడలో వాక్కాయ ఫ్యాక్టరీ ఒకటి ఏర్పాటు కావడంతో ఇప్పుడు ఇబ్బంది లేదు. రాష్ట్రవ్యాప్తంగా పలువురు రైతులు మా వద్ద నుంచి వాక్కాయ మొక్కలను తీసుకెళ్తున్నారు. ప్రకాశం జిల్లాలో 30 నుంచి 40 ఎకరాల్లో మాత్రమే వాక్కాయ సాగవుతోంది. ప్రస్తుతం ఏడెకరాల్లో వాక్కాయ సాగు చేస్తున్నాం. మరో మూడు ఎకరాల్లో పంట వేయబోతున్నాం. వాక్కాయ ఫ్యాక్టరీల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తే బాగుంటుంది. ఈ పంట వేసిన పొలంలో ఏడాదికి రెండు నెలల్లో మాత్రమే పని ఉంటుంది. మిగతా సమయంలో ఇతర పనులు చూసుకునేందుకు రైతుకు వెసులుబాటు ఉంటుంది.  
 
చెర్రీ అనగానే అందరికీ ఎరుపు రంగులో నోరూరించే తియ్యని పండు గుర్తుకు వస్తుంది. అయితే క్యాండేట్ చెర్రీ(వాక్కాయ) కన్నా నాణ్యమైన చెర్రీ హిమాలయ ప్రాంతాల్లో మాత్రమే లభ్యమవుతుంది. ఈ పండు కోతకు రాగానే వాటిలోని విత్తనాలను తొలగించి ఉడికిస్తారు. తీపి కోసం పంచదార పాకంలో వేస్తారు. చెర్రీలను కిళ్లీలు, కొన్ని రకాల కేకుల తయారీలోనూ వినియోగిస్తున్నారు. వాక్కాయ.. చెట్టు నుంచి కోసేటప్పుడు ఎర్రగానే ఉంటుంది. కానీ రుచి పుల్లగా ఉంటుంది. దీంతో పప్పు, పులిహోర తయారీలో చింత పండుకు బదులుగా వాక్కాయలను వాడుతున్నారు. హోటళ్లలో వాక్కాయ పప్పు స్పెషల్ అంటూ ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తుండడం విశేషం. కొద్ది పెట్టుబడితో నిశ్చింతగా నికరాదాయాన్నిచ్చే వాక్కాయ సాగు మెట్ట రైతులకు ఎంతో అనువైనది.

నష్టం వచ్చే ప్రశ్నే లేదు..!
ఆరు ఎకరాలు వాక్కాయ పంట వేశాం. ముందుగా వేసిన రెండెకరాలు కాపు కొచ్చింది. మంచి పంట, నష్టం ప్రశ్నేలేదు. మా పంట మొత్తాన్నీ చెన్నై వ్యాపారికి అమ్ముతున్నాం. కిలోకు రూ.35 గిట్టుబాటవుతోంది. వినాయకచవితి పండుగ రోజుల్లో మాత్రం ఈ కాయలకు చెన్నైలో మంచి డిమాండ్ ఉంటుంది. వినాయక చవితి పూజకు వాడే పత్రిలో బృహతి కూడా ఒకటి. వినాయక చవితికి నెల రోజుల ముందు నుంచి వాక్కాయల దిగుబడి వస్తుంది. వినాయక చవితి అయిపోయిన నెలరోజుల్లో కాపు పూర్తవుతుంది. వీటిని తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాస్ ట్రబుల్ వచ్చే ప్రశ్నే లేదు. చింతపండుకు బదులుగా దీన్ని వాడుతున్నారు. పిల్లలు ఈ కాయలను ఉప్పు, కారం అద్దుకుని ఇష్టంగా తింటుంటారు. ప్రభుత్వం ఈ పంటపై దృష్టిపెట్టాలి.

ఉపయోగాలు
వాక్కాయలను కాన్ బెర్రీస్ అని కూడా అంటారు. వీటిలో మధుమేహాన్ని నివారించే ఎన్నో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయని జర్మనీ లోని డ్యుసెల్ డోర్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్త అనా రోడ్రిగ్స్ తెలిపారు. ఈ వాక్కాయ వగరుగా పుల్లగా ఉంటుంది. భారత క్రాన్ బెర్రీస్ గా పిలవబడుతూ మూత్రపిండాలలో రాళ్ళని కరిగించేవిగా మూత్ర నాళాలని శుభ్రపరిచేవిగా ప్రసిధ్ధి చెందినవి. విటమిన్ సి అధికంగా ఉన్న ఈ వాక్కాయ అద్భుతమైన యాంటీ బాక్టీరియల్, మరియు యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఉబ్బసం చికిత్స నుండి చర్మ వ్యాధుల వరకు, వాక్కాయలు శరీరానికి చాలా ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఈ వాక్కాయ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

*వగరుపులుపు కలిసిన ఈ వాక్కాయలో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఉదర సమస్యలను నివారించడానికి ముఖ్యంగా అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం తొలగించడానికి సహాయపడుతుంది. ఎండిన పండ్ల పొడిని నీటితో కలిపి తీసుకుంటే.. కడుపుని తేలికపరుస్తుంది మరియు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది, దీంతో ఆకలిని పుట్టేలా చేస్తుంది.

*వాక్కాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంది. దీంతో పూర్వకాలంలో జ్వరం వస్తే చికిత్స కోసం ఉపయోగించేవారు. ఇది గొప్ప యాంటీఆక్సిడెంట్ కావడం వల్ల, పోషకాలు అంటువ్యాధులతో పోరాడటం ద్వారా జ్వరాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

*సీజన్ లో దొరికే ఈ వాక్కాయను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని మురుగుపరుచుకోవడానికి ఉపయోగపడుతుంది. విటమిన్లు మరియు ట్రిప్టోఫాన్లతో పాటు మెగ్నీషియం ఉండటం సిరోటోనిన్ ఉత్పత్తిని ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది.

*వాక్కాయ జ్యూస్ తాగడం వలన గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. గుండె కండరాలను బలోపేతం చేయడానికి రోజూ 15 నుండి 20 మి.లీ వాక్కాయ రసం తీసుకోవచ్చు.

*శరీరం డీహైడ్రేషన్ బారిన పడితే.. తక్షణ శక్తిని ఇస్తుంది. అంతేకాదు శరీరంలోని మంటను తగ్గిస్తుంది.

*వాక్కాయ శరీరంలోని పిత్తాశయం, చిగుళ్ళలో రక్తస్రావం మరియు అంతర్గత రక్తస్రావం వంటి ఎన్నో సమస్యలను నివారిస్తుంది.

*ప్రతిరోజూ వాక్కాయల రసం తీసుకోవటం వలన ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది.

* దంతాలు పుచ్చిపోకుండా చేయడమే కాదు నోటి దుర్వాసన నుంచి కాపాడుతుంది.

*మెదడు సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడటంలో అత్యంత ప్రయోజనకారి వాక్కాయ

వాక్కాయ వంటలు

వాక్కాయలు వర్షాకాలంలో బాగా వస్తాయి. ఈ సీజన్‌లో జలుబు, దగ్గు, అజీర్తి వంటి సమస్యలు ఎక్కువ కాబట్టి, ప్రకృతి మనకు వాక్కాయలు ప్రసాదించిందేమో అనిపిస్తుంది. వాక్కాయ అరుగుదలను పెంచుతుంది. అందుకు కూరల్లో చింతపండుకు బదులుగా ఈ సీజన్‌లో వాక్కాయలు వాడొచ్చు. వీటిలో విటమిన్‌ సి ఉంటుంది. కాబట్టి పచ్చడిలాగా, సలాడ్‌లాగా చేసుకుంటే బాగుంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వాక్కాయలు ఆందోళనను తగ్గిస్తాయి. ఫీల్‌గుడ్‌ ఫ్యాక్టర్‌ను పెంచుతాయి. ఇవి దొరికినంత కాలం ప్రతిరోజూ ఆహారంలో చేర్చండి. వీటితో రెండు రెసిపీలు...

వాక్కాయ సలాడ్‌
కావాల్సినవి: అరకప్పు వాక్కాయ ముక్కలు, ఒక టీ స్పూను పచ్చిమిర్చి పేస్టు, రెండు టీ స్పూనులు పంచదార, అర టీ స్పూను మిరియాల పొడి, తగినంత ఉప్పు, ఒక టీ స్పూను నువ్వుల నూనె
తయారీ: అన్నీ ఒక గిన్నెలో కలిపి, భోజనంతో పాటు తినొచ్చు. వెరైటీగా ఆపిల్‌ ముక్కలు, జామకాయ ముక్కలు, బొప్పాయి ముక్కలను కూడా కలపవచ్చు. 

వాక్కాయ కొబ్బరి చట్నీ
కావాల్సినవి: అరకప్పు వాక్కాయ ముక్కలు, అరకప్పు పచ్చి కొబ్బరి తురుము, నాలుగు పచ్చి మిరపకాయలు, మూడు వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు
తయారీ: అన్నీ కలిపి గ్రైండ్‌ చేసుకుని, భోజనం లేదా టిఫిన్స్‌తో తీసుకోవచ్చు. వీటితో పాటు వాక్కాయ పప్పు, పులిహోర, సాంబారు, మురబ్బా, హల్వా... ఇలా ఎన్నో రకాలుగా వాక్కాయను రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఈ సీజన్‌లో ఇవి ఎక్కువగా వస్తాయి కాబట్టి వీటని తేనె వేసి నిల్వ ఉంచుకోవచ్చు.
....☺️🌿🌺🌾

Yes, she has gained weight? Defeated without losing a bout.

అవును, ఆమె కొంచెం బరువు పెరిగే వుంటుంది. ఎందుకంటే…. ఆటల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే నిండైన ఆత్మాభిమానాన్ని, విశ్వ వేదికపైనే కాదు వ...